Saturday 28 May 2011

Ragini MMS


* ‘రాగిణి ఎం.ఎం.ఎస్’ (బాగోలేదు)
తారాగణం:
రాజ్‌కుమార్ యాదవ్
కైనాజ్ మోతీవాలా
తదితరులు
కెమెరా: త్రిభువన్ బాబు
నిర్మాతలు: ఏక్తా కపూర్, శోభా కపూర్
దర్శకత్వం: పవన్ కృపాలానీ
మంచి సినిమాకే కాదు. పరమ చెత్త సినిమా అని నిరూపించడానికీ కొన్ని అర్హతలు కావాలనుకొంటే ‘ఇది పరమ బోరు చిత్రం’ అని ముద్ర వేయడానికి కొన్ని ప్రత్యేకతలు ఉండాల్సిందే అని పట్టుబడితే - అవన్నీ నిండుగా, కావల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉన్న చిత్రం ‘రాగిణి ఎం.ఎం.ఎస్.’. సాధారణంగా ఎడిటింగ్ రూమ్... డస్ట్‌బిన్‌లో ఉండాల్సిన సన్నివేశాలన్నీ మళ్లీ ఓ వరస క్రమంలో జోడించి, దానికి వెర్రి కూతలు, కేకలతో కూడిన నేపథ్యం సంగీతం అందిస్తే ఇదిగో అచ్చం ఇలాంటి సినిమానే తయారవుతుంది. వాల్ పోస్టర్లు చూసి ఇదో రొమాంటిక్ సినిమా అని గంపెడు ఆశలతో థియేటర్‌కి వెళ్లినవాళ్లూ, సినిమా రూపకర్తలు చెప్పిన మాటలు నమ్మి - ఇదేదో అతి భయంకరమైన థ్రిల్లర్ సినిమా అని భ్రమపడి థియేటర్‌కి వెళ్లినవాళ్లూ పాప పరిహారం చెల్లించుకోక తప్పదు. తాము ఎంత పెద్ద తప్పు చేశామో తొలి రెండు సన్నివేశాలూ చూస్తే అర్థమైపోతుంది. ఇంతకీ మైండ్ పాడుచేసే ఈ సౌండ్ సినిమాలో ఏమున్నాయి? ఏం లేవు? అని తెలుసుకోవాలనుకొంటే కథ గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఉదయ్ (రాజ్‌కుమార్ యాదవ్) నటుడిగా వెలగాలని కలలు కంటాడు (అయితే సినిమాల్లోనా? లేదంటే నీలి చిత్రాల్లోనా? అనే అనుమానం మాత్రం ప్రేక్షకులకు చివరి వరకూ వెంటాడుతుంది). ‘నేను చెప్పినట్టు చేస్తే... నీ కల నెరవేరుస్తా’ అని ఓ దర్శక గురువు ఉదయ్‌కి మాటిస్తాడు. ఆ ప్రకారం రాగిణి (కైనాజ్)తో సరస కల్లాపాలు చేస్తూ... ఆ దృశ్యాల్ని వీడియోలో బంధించి ఇవ్వాలి. అందుకోసం వారాంతరం సెలవుల్లో ఓ పాడుపడ్డ గెస్ట్‌హౌస్‌ను ఎంచుకొంటాడు. అయితే... ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందని, అది అందరినీ చంపేస్తుందని ఓ ప్రచారం జరుగుతుంది. అయినా భయపడకుండా రాగిణిని అక్కడికి తీసుకొస్తాడు. ఆ ఇంట్లో ప్రతి అడుగునా ఓ కెమెరా అమరుస్తాడు. ఇక పని మొదలు పెడదాం అనేసరికి అక్కడికి మరో జంట వస్తుంది. రెండు రీళ్ల కథ నడిచాక ‘అమ్మో.. ఈ ఇంట్లో దెయ్యం ఉంది’ అని భయపడుతూ వాళ్లు వెళ్లిపోతారు. అజయ్ మళ్లీ తన కార్యక్రమంలోకి దిగుతుంటే... ఎవరో వెనక్కిలాగినట్టు అంత దూరం వెళ్లి పడతాడు. అక్కడ నుంచి ఆ ఇంట్లో ఎవరో ఉన్నారనే భయం వాళ్లిద్దరినీ వెంటాడుతుంది. ఓ అదృశ్య శక్తి, ఈ జంటని భయపెడుతూ ఉంటుంది. ఉదయ్‌ని ముప్పుతిప్పలు పెడుతుంది. ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగింది? అజయ్ పథకం పారిందా? రాగిణి ఎలా బయట పడింది? అసలింతకీ ఆ గెస్ట్‌హౌస్‌లో ఉన్న దెయ్యం కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘రాగిణి ఎం.ఎం.ఎస్.’
రాంగోపాల్ వర్మ మన భారతీయ సినిమాకి చేసిన మేలు ఏమిటి? అని అడిగితే సడన్‌గా చెప్పడం కష్టం. చాలాసేపు ఆలోచించుకుని చివరికి ‘ఏం లేదు’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. కీడు చెప్పమంటే మాత్రం టక్కున ఇలాంటి సినిమాలను ఉదహరించాల్సిందే. ఈ కథకూ, ఈ సినిమాకీ, వర్మకూ ఏ మాత్రం సంబంధం లేకపోవచ్చు. అయితే తలా తోక లేకుండా దెయ్యం కథలు తీసి, డబ్బులు చేసుకోవచ్చు అని నిరూపించి, పవన్ కృపాలానీ లాంటి దర్శకులకు మార్గదర్శనం చేసింది మాత్రం కచ్చితంగా వర్మనే. ఈ సినిమాలో మాత్రం కృపాలానీ మరింత ముందుకెళ్లి తలా, తోక, చేతులూ, కాళ్లూ ఇలా ఏమీ లేని సినిమా తీశాడు. రొమాన్స్ చూపిస్తే ఇది ‘ఏ’ తరహా చిత్రమయ్యేది. శృంగార పురుషులు పండుగ చేసుకొనే వారు. భయపెడితే థ్రిల్లర్ అనుకొనేవాళ్లం. ఇవి రెండూ ఈ సినిమాలో కనిపించవు. అరుపులూ, కేకలు రెండు మూడు బూతు డైలాగులు తప్ప! చివరాఖరికి దెయ్యాన్ని కూడా చూపించలేదు. టక్ టక్ టక్‌మని గిలగిచ్చకాయ్ ఆడించి - అదే దెయ్యం అని భయపెట్టించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా ఈ సినిమాకి మైనస్ మార్కులు వేసినా తప్పులేదు. చీకట్లో, మసక మసక వెలుతురులో సినిమా తీసి, తామేదో సాంకేతికంగా అద్భుతం చేసినట్టు గొప్పలు చెప్పుకొన్నారు ఈ సినిమా రూపకర్తలు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం బయట పెట్టడానికి దెయ్యం కథలు బాగా ఉపయోగపడతాయి. బాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఆదరణ లభించడానికి కారణం ఇదే. అక్కడి కథలో గొప్పదనం లేకపోయినా... సాంకేతిక ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తారు. మన సినిమా కథలోనూ, జిమ్మిక్కులు చేయడంలోనూ ఎంత వెనుకబడి ఉన్నామో ఇలాంటి సినిమాలే చెబుతాయి. మసాలా వాల్‌పోస్టర్లు చూపించి, జనాన్ని థియేటర్ వరకూ తీసుకురావచ్చు అనుకొనే దర్శక, నిర్మాతలకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? టైమ్ పాస్ కోసమో, టిక్కెట్టు ఎలాగో పక్కవాడు పెట్టుకుంటాడనో ఈ సినిమాకి వెళితే ఇరుక్కుపోవడం గ్యారెంటీ.

andhrabhoomivennela

This Blog is created for andhra boomi vennala
టక్ టక్ టక్‌మని గిలగిచ్చకాయ్ ఆడించి - అదే దెయ్యం అని భయపెట్టించే ప్రయత్నం చేశారు. 



సాహితి garu Ragini mms Gurinchi