Thursday 21 July 2011

* ‘కీ’ (బాగోలేదు)


తారాగణం:
జగపతిబాబు, స్వప్న, సుకుమార్
దీప్తీబాజ్‌పేయ్, సంపత్, సోనియా
ఛాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: విజయ్ కురాకుల
నిర్మాత: సుకుమార్‌రెడ్డి
నిర్మాణం: డ్రీమ్స్ థియేటర్స్
దర్శకత్వం: నాగేంద్ర ప్రసాద్

బిసి సెంటర్ల ప్రేక్షకులు మహారాజ పోషకులు. ఓ సినిమా బాక్సాఫీసు రికార్డు బద్దలుకొట్టాలంటే అక్కడ జనానికి నచ్చాల్సిందే. మాస్ మసాలా అంశాలు జోడించడానికి కారణం ఇదే. ఆ సినిమాలకు క్లాస్ ప్రేక్షకులూ వచ్చారు. అయితే మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన నేపథ్యంలో ఏక్లాస్ వర్గం కోసం ప్రత్యేక సినిమాల్ని రూపొందిస్తున్నారు. ఈ విధానం బాలీవుడ్‌లో బాగా పాపులర్. కథను కాకుండా కానె్సప్టుని నమ్ముకుని వచ్చిన కొన్ని సినిమాలు కాసులు కురిపించాయి. అదే ప్రయోగం తెలుగు సినిమాలకూ పాకింది అనుకుంటే...ఆ కోవలో వచ్చిన మొదటి సినిమా 'కీ'. ఈ కానె్సప్ట్ ఓరియెంటెడ్ ప్రయోగం మన వాళ్లకి ఎంత వరకూ నచ్చుతుంది? దాని ఫలితం ఏమిటి? అనే విషయాల్లోకి వెళ్లే ముందు కథేంటో తెలుసుకుందాం.
బాగా పేరుపొందిన ఓ కంపెనీలో కీలక స్థానం కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివిధ రంగాలలో పేరు తెచ్చుకున్న తొమ్మిదిమంది చివరి పరీక్షకు హాజరవుతారు అయితే.. ఉద్యోగం మాత్రం ఒక్కరికే. ఎంపిక విధానం మాత్రం వినూత్నంగా ఉంటుంది. ఇన్విజిలేటర్ (జగపతిబాబు) ప్రతి ఒక్కరికీ ఓ పేపర్ ఇస్తాడు. అది చూడ్డానికి తెల్లకాగితం మాత్రమే. కానీ రహస్యం అంతా అందులోనే ఉంది ముందు ప్రశ్న ఏమిటో ఛేదించాలి. ఆ తర్వాత సమాధానం చెప్పాలి. జవాబు పత్రాల్ని చింపడం కానీ, పాడు చేయడం కానీ చేయకూడదు. అక్కడో సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉంటాడు. అతనితో మాట్లాడినా, ఒక్కసారి పరీక్ష హాలునుంచి బయటకు వెళ్లినా వాళ్లు ఉద్యోగానికి అనర్హులే. సమాధానం కోసం వాళ్లకు ఇచ్చిన సమయం తొంభై నిముషాలు. ఇలాంటి కొన్ని నిబంధనలతో ఆట మొదలవుతుంది. ఇంతకీ ఆ పేపర్‌లో ఏముంది? సమాధానం ఎవరు రాబట్టారు? ఈ ఆట వెనక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అనే విషయాలు తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా ఏవర్గానికి నచ్చుతుంది? ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా రాబోయే ఫలితాల్ని అంచనా వేయకుండా ఫార్ములా సూత్రాలకు విరుద్ధంగా వెళ్లి కథను ఎంచుకోవడమనే ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచించగలుగుతున్నారు....అనే విషయం ధైర్యంగా చెప్పుకోవడానికి ఇలాం టి సినిమాలు ఉపయోగపడతాయి. ఈ సినిమాలో ఓ ఇంగ్లీష్ డైలాగ్ ఉంది. దాన్ని తెలుగులో మార్చుకుంటే- 'కార్య సాధకులకే తప్ప...ఎప్పుడూ ఆలోచనలతో గడిపేవారికి ఈ ప్రపంచంలో విలువ లేదు' అని అర్ధం వస్తుంది. అందుకే కార్యరంగంలోకి దిగిన దర్శక నిర్మాతలు ఇద్దరికీ వీరతాళ్లు వేయాల్సిందే. అయితే ఆ ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి? అని అడిగితే కథ మళ్లీ మొదటికి వస్తుంది.
ముందే చెప్పినట్టు ఇందులో కథ కన్నా, కానె్సప్టుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి అంశాన్ని ఎంచుకుంటున్నప్పుడు కథనం తప్పకుండా బలంగా ఉండాల్సిందే. తరువాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ కలగాలి. అయితే 'కీ'దాన్ని సగం మాత్రమే నెరవేర్చింది. నటీనటులు అంతా కొత్తవారే కాబట్టి త్వరగా రిజిస్టర్ అవ్వరు. జగపతిబాబు ఉన్నా ఆయన అచ్చం ఈ సినిమాలోని ఇన్విజిలేటర్‌లానే ఇలా వచ్చి అలా వెళతాడు. తెలుగు చానల్ రంగంలో బాగాపాపులర్ అయిన న్యూస్‌యాంకర్లు ఈ 'కీ'లోకనిపిస్తారు. వాళ్ల డైలాగులు చెబుతున్న విధానం చూస్తే అచ్చం టీవీ-9లో న్యూస్ చూస్తున్నట్టే ఉంటుంది రియాల్టీ షోల పేరుతో టీవీ చానళ్లవాళ్లు చేసే హంగామా మనకు తెలుసు. ఈ సినిమా చూస్తుంటే పెద్ద తెరమీద ఓ రియాల్టీ షోచూస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప మనం ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. ఉద్యోగం కోసం..ఒకరిని ఒకరు చంపుకుంటుంటే వినోదం చూపిన ఆ కంపెనీ సిఇఓ చివర్లో వచ్చి సందేశం వల్లించడం వింతగా విడ్డూరంగా ఉంటుంది. సినిమా రూపకర్తలు చెప్పినట్టు అంతా ఫజిల్‌లా ఉన్నా బాగుండేది. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడు కథలో తానూ ఓ పాత్రలా మారిపోయే వీలు చిక్కేది. కానీ అలా జరగలేదు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికొస్తే ఆర్ట్, కెమెరా, సంగీతం వీరందరికన్నా కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరక్టర్లే తక్కువ కష్టపడ్డాడు. కథంతా ఒకే రూమ్‌లోజరుగుతుది కాబట్టి వాళ్లకు అసలు పనిచేసే అవకాశమే దక్కలేదు. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఒకే గదిలో విభిన్న కోణాల్లోంచి కెమెరాను నడిపించి పీజీవిందా ఆకట్టుకుంటాడు. ఈ గంటన్నర సినిమాలు మాస్ వర్గానికి చేరువ అవుతుందా? అని అడిగితే కష్టమే అని చెప్పాల్సి వస్తుంది. వాళ్లకోసం కథలో ఐటమ్ సాంగ్ అతికించలేని దర్శకుడిని మెచ్చుకోవాలి. అయితే ఈ కథతో క్లాస్‌నైనా మెప్పించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దానికి తోడు సైన్స్ ఫార్ములా పదాలు...ఎవరికోగాని ఎక్కవు. సినిమా మూడు గంటలైనా, గంటలోపే ముగిసినా అంతిమంగా ప్రేక్షకుడికి వినోదం ముఖ్యం. దానికి లోటు జరగకపోతే క్లాసూ, మాసూ అందరూ చూస్తారు. మొత్తంమీద చెప్పొచ్చేదేమిటంటే కానె్సప్టు కథతో అల్లుకున్న ఈ సినిమాలో తొమ్మిది పాత్రలతో పాటు థియేటర్లో ప్రేక్షకుడూ బందీగా మిగులుతాడు.

మీడియా కథలకి భలే

అటుతిరిగి ఇటు తిరిగి ఎక్కడెక్కడికో పయనించిన చిత్రపరిశ్రమ కథలు మీడియాని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మీడి యా కథలకి మంచి గిరాకీ ఉంది. చిత్రపరిశ్రమ కూడా వీటిపైనే గురిపెట్టింది. ఇటీవల వచ్చిన డబ్బింగ్ చిత్రం 'రంగం' హిట్ కావడం, వెనువెంటనే ఇదే నేపథ్యాన్ని దర్శకులు ఎంచుకుంటున్నారు.
ఒకప్పుడు మన హీరో రాయుడు, రౌడీ పోలీస్ ఆఫీసర్, ప్రేమికుడు, ఖైదీ, డాక్టర్. తాజాగా ఇప్పుడు వెండితెర హీరో జర్నలిస్టు. 'రంగం' సినిమాలో హీరో ఫోటో జర్నలిస్టు. ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రంలో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. గుప్పెడేసిగా కలుపుమొక్కల్లా పుట్టుకొస్తూ తెలుగు టీవీ సీరియల్స్ కంటే అత్యంత దారుణంగా బలహీన కథ, కథనాలతో విడుదలవుతున్న తెలుగు సినిమాలు ఎక్కడా కూడా నాలుగైదు రోజులపాటు ఆడడం లేదు. పాపం సినిమా హాల్స్ యాజమాన్యం తీవ్రంగా నిరాశపడుతున్నారు. వందల్లో వస్తున్న తెలుగు చిత్రాల్లో ఈ సినిమా సూపర్ అని గట్టిగా చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలకి మన ప్రేక్షకులు నీరాజనాలు అర్పిస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అలాంటిదే 'రంగం' సినిమా కూడా! ఈ సినిమా ఇతివృత్తం మీడియా కావడం విశేషం. అలాగే '180' సినిమాలో నిత్యామీనన్ కూడా జర్నలిస్టే. 'నగరం నిద్రపోతున్న వేళ'లో కూడా ఛార్మి జర్నలిస్టే. కథంతా ఛార్మి చుట్టూ తిరుగుతుంది. పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఆధారం చేసుకుని అల్లిన కథ ఇది. తాజాగా విడుదలైన 'విరోధి' సినిమాలో హీరో శ్రీకాంత్ జర్నలిస్టు. జయదేవ్ పాత్రలో నటించాడు. ఇలాంటి కథలు ఎంచుకుంటే సరిపోదు ఆసక్తికరంగా నడిపించాలి. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా 'రంగం' మాత్రం ఒకేఒక్కడు, అంతిమ తీర్పు తరహాలో హిట్టయింది. హీరోని జర్నలిస్టు పాత్రలో చూపించడం మన చిత్రపరిశ్రమకి కొత్తేమీ కాదు. అయితే ఏకకాలంలో ఇలాంటి సినిమాలు మార్కెట్‌లోకి రావడమే విశేషం.
ప్రఖ్యాత మలయాళ దర్శకుడు 'జోషి' కృష్ణంరాజు హీరోగా వచ్చిన 'అంతిమ తీర్పు' చాలా చక్కటి సినిమా. ఇప్పుడు కూడా చూడాలనిపిస్తుంది. '్ఢల్లీ డైరీ' పత్రిక ఎడిటర్‌గా కృష్ణంరాజు చక్కటి నటన కనబరిచారు. పాటలు, ద్వంద్వార్ధాల మాటలు లేకుండా కథలోని సీరియస్‌నెస్‌ని మిస్ చేయకుండా దర్శకుడు బాగా తెరకెక్కించాడు. 'అంతిమ తీర్పు' సినిమాలో జర్నలిస్టుగా నటించిన సురేష్‌గోపీ ఆ తర్వాత వచ్చిన రిపోర్టర్, జర్నలిస్టు సినిమాల్లో హీరోగా నటించాడు. 'వెలుగునాడు' పత్రిక చీఫ్ ఎడిటర్ అరుణ్‌కుమార్‌గా గోపీ నటన సూపర్. పత్రికా వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దాదాపు ప్రతి సినిమాలో జర్నలిస్టుకి ప్రాధాన్యత ఉంటుంది. 'ఆలయశిఖరం' సినిమాలో 'చాకిరేవు' పత్రిక ఎడిటర్‌గా పి.ఎల్.నారాయణ పాత్రని చక్కగా మలిచారు. బహుశా ఇది 'ఎన్‌కౌంటర్' పత్రిక ఎడిటర్ పింగళి దశరధరామ్‌ని ఊహించుకుని ఈ పాత్ర రూపకల్పన చేసి ఉండవచ్చు. 'అంకుశం' చిత్రంలో కూడా జర్నలిస్టు పాత్ర కీలకమే! శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఒకే ఒక్కడు' మీడియా తలచుకుంటే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో తెలియజేసింది. ఈ సినిమాలో హీరో అర్జున్ ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటించాడు. శక్తివంతమైన పత్రికా వ్యవస్థని అంతకంటే శక్తివంతంగా సెల్యులాయిడ్‌పై చూపించడం కేవలం కొందరు దర్శకులకే సాధ్యపడింది. మణిరత్నం, శంకర్, జోషిలు విజయం సాధించారు. కళాతపస్వి కె.విశ్వనాధ్ సైతం 'సాగరసంగమం' సినిమా ప్రారంభంలో కమల్‌ని విలేఖరిగా చూపించారు. వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన 'రాము' సినిమాలో ఫోర్త్ ఎస్టేట్ ప్రధాన భూమిక పోషించింది. పత్రిక ఎడిటర్ పాత్రలో శారద హుందాగా నటించారు. 'షాక్'లో టాబు కూడా టీవీ చానల్ రిపోర్టర్‌గా సీరియస్‌గా కనిపించింది. ఒకటీ, అరా తప్ప దాదాపు అందరు హీరోలు మీడియా రిపోర్టర్ల పాత్రలో నటించారు. 'పరశురాం' సినిమాలో శ్రీహరి 'టెర్రర్' పత్రిక జర్నలిస్టుగా న్యాయం చేకూర్చాడు. ఈ చిత్రంలో డైలాగులు బాగుంటాయి. కేవలం కలం బలం మాత్రమే కాదు పత్రికా ప్రతినిధికి కండబలం కూడా ఉండాలని పరశురాం పాత్ర నిరూపించింది.
'బంగారం' చిత్రంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఓ టీవీ చానల్ రిపోర్టర్. అసలు కథ వదిలేసి హీరోని మరో కోణంలో చూపించడంవలన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తిరుపతిస్వామి దర్శకత్వంలో వచ్చిన 'గణేష్'లో ఓ సిన్సియర్ రిపోర్టర్‌గా వెంకటేష్ పాత్రంలో జీవించాడు. డైరక్టర్ తిరుపతిస్వామి స్వతహాగా జర్నలిస్టు కావడం విశేషం. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ఒకటి ఉంది.
ఈ సినిమాను సుమారు ఎనిమిదిమంది ప్రొడ్యూసర్లు వద్దన్నారు. అబ్బే ఏమాత్రం ఆడదన్నారు. తీరా చిత్రం విడుదలై పలు అవార్డులు సాధించి ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. మనలో నిద్రాణంలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది. అబ్బే ఇదేం సినిమా అన్నవాళ్లే...అబ్బో అసలు సినిమా అంటే ఇదే అన్నారు. కథా రచయితగా మదన్‌కి, హీరోగా రాజేంద్రప్రసాద్‌కి, డైరక్టర్ చంద్రసిద్ధార్ధకి పేరు తెచ్చింది. ఈ సినిమా పేరు 'ఆ నలుగురు'. పత్రికా ఎడిటర్‌ల గౌరవాన్ని ఒక్కసారిగా పెంచేసిన సినిమా ఇది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రావచ్చు రాకపోవచ్చు. కానీ వ్యవస్థకి అవసరం ఉంది. 'జగపతిబాబు హీరోగా వచ్చిన 'సామాన్యుడు' ఫర్వాలేదు. అశ్లీలం తగ్గించి అసలు కథ మీద దృష్టిపెడితే బాగుండేది. మీడియా ఇతివృత్తంగా సినిమాలు ఎంపిక చేసుకోవడం మంచిదే కానీ మసాలాలు తగ్గించి కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తే ప్రేక్షకులు చూస్తారు. లేకపోతే ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. ఇలాంటి కథల్లో ప్రతి సన్నివేశంపై కూడా దర్శకుడు పూర్తిగా అధ్యయనం 

Saturday 2 July 2011

* భేజా ఫ్రై-2

* భేజా ఫ్రై-2

తారాగణం:
వినయ్ పాఠక్ , మినీషాలాంబా
కె.కె.మీనన్, సురేషమీనన్ తదితరులు
సంగీతం: సాగర్ దేశాయ్
రచన, దర్శకత్వం: సాగర్ బళ్ళారి

భేజాఫ్రై వెర్రిబాగులవాడు మళ్లీ వచ్చాడు! గాయకుడు కావాలన్న పట్టుదలతో పల్లెటూరునుంచి నగరానికొచ్చి మ్యూజిక్ కంపెనీ యజమాని బుర్ర తీనేసిన ది గ్రేట్ అమాయక చక్రవర్తి భరత్ భూషణ్ (వినయ్‌పాఠక్) భేజాఫ్రై-2 అంటూ మరోసారి గందరగోళం సృష్టించడానికి ప్రత్యక్షమయ్యాడు. నాలుగేళ్ల విరామం తరువాత వచ్చినవాడు మరింత ఆధునికంగా, స్టయిలిష్‌గా, ఇన్‌కంటాక్స్ సూపర్‌వైజర్ రూపంలో దిగబడి, బోగస్ కంనీల కార్పొరేట్ బాస్ వెంటపడ్డాడు. మెదడు ఫ్రై చేసి వదిలాడు.
'లే డిన్నర్ డీ కాన్స్' అనే ఫ్రెంచి కామెడీకి అనుసరణ అయిన భేజాఫ్రై (2007) విజయం చిన్న సినిమాల ట్రెండ్‌కి ఊపునిచ్చింది. అదొక ఆధునిక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రత్యర్థుల పాత్రలు ధరించిన వినయ్‌పాఠక్, రజత్ కపూర్‌ల మధ్య కెమిస్ట్రీ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేట్టుగా కుదిరింది. గాయకుడిగా ఆడియో కంపెనీ యజమాని రజత్‌కపూర్ ఇంట్లో చేరి బుర్ర తినేస్తూ భోళాతనంతో రజత్‌కపూర్ సాంసారిక జీవితాన్ని పాడుచేసేస్తాడు. ఈ కామెడీ బాగా పేలింది!
ఈసారి ఈ భరత్ భూషణ్ 'ఆవో గెస్ కరే' అనే రియాల్టీ షోలో జాక్‌పాట్ కొట్టేస్తాడు. పాతిక లక్షల క్యాషు, రెండు రాత్రులు ఓడ ప్రయాణం గిఫ్టు పుచ్చుకుని ఓడెక్కుతాడు. ఆ ఓడలో ఇన్‌కంటాక్స్ శాఖ కన్నుగప్పి పారిపోతున్న కార్పొరేట్ బాస్ అజిత్ తల్వార్ (కెకె మీనన్) ఉంటాడు. ఇతను రకరకాల బోగస్ కంపెనీలు స్థాపించి పెద్ద స్కాం చేశాడు. భరత్ భూషణ్ ఇతడ్ని తగులుకుంటాడు. ఇతను భరత్‌భూషణ్ ఇన్‌కంటాక్స్ సూపర్‌వైజర్ అని తెలుసుకుని, తనని పట్టుకునేందుకే వచ్చాడనుకుని సముద్రంలోకి తోసేయబోతాడు. ఆ ప్రయత్నం ఫెయిలై తనే వెళ్లి సముద్రంలో పడతాడు. ఇతడి సెక్రటరీ వచ్చి భరత్‌భూషణ్‌ని తోసేస్తాడు. సముద్రంలో పడ్డ అజత్ తల్వార్-్భరత్ భూషణ్‌లిద్దరూ బతుకు జీవుడా అని ఒడ్డుకు చేరుకుని ఆ నిర్జన ప్రాంతంలో పడరాని పాట్లు పడతారు. ఇంటర్వెల్ వరకూ ఈ సినిమా మంచి హాస్యాన్ని పండిస్తుంది. బ్లడీఫూల్ భరత్ భూషణ్ పాత్రలో వినయ్ పాఠక్ బాగా రాణిస్తాడు. అతడికి కె.కె మీనన్‌తో కెమిస్ట్రీ కుదరకపోయినా, ఇంకాఓడలో రకరకాల వీఐపీలతో హీరోయిన్ మినీషాలాంబాతో చేసే వెర్రి చేష్టలు క్లాస్ హ్యూమర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇతనూ, కె.కె.మీనన్ సముద్రంలో వెళ్లి పడే ఇంటర్వెల్ మలుపుతో మాంచి కిక్‌నిస్తుందీ సినిమా. అంతవరకే. ఆ తర్వాత సెకండాఫ్ అంతా రుచీ పచీ లేని మాడిన ఫ్రైగా విసుగుపుట్టిస్తుంది. దారీ తెన్నూ తెలీని నిర్జన ప్రాంతంలో చిక్కుకున్న ఇద్దరి మధ్యా తగాదాలకి ఏమాత్రం బేస్ ఉండదు. ఇందుకు కారణం వినయ్ పాఠక్ పాత్రకి ఏ లక్ష్యమూ లేకపోవడమే. ఇతనే తనని పట్టుకునేందుకు వచ్చిన ఐటి అధికారి అని భ్రమించి తప్పించుకునే లక్ష్యం కె.కె.మీనన్ ఒక్కడికే ఉంది. ఇతను స్కాం వీరుడని కూడా వినయ్ పాఠక్‌కి తెలీనే తెలీదు.
పాయింటులేని కథనం, పాత్రలు స్క్రీన్‌ప్లేని కుప్పకూల్చాయి. ఫస్ట్ఫాలో క్లాస్ హ్యూమర్ కాస్తా సెకండాఫ్‌లో చీప్ కామెడీగా మారిపోయింది. రచయిత, దర్శకుడు సాగర్ బళ్లారి ఈ రెండో ప్రయత్నంలో మసాలాలు మిస్ చేసి ఫ్రైని పూర్తిగా మాడ్చాడు.

కామెడీ కాలుష్యం

అశ్లీల దృశ్యాలకీ, పచ్చి బూతు మాటలకీ హాస్యం అని పేరు పెట్టడం కేవలం తెలుగుసినిమాకే చెల్లింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలు ఆరోగ్యవంతమైన కామెడీ అందిస్తుంటే మనం మాత్రం దిగజారిపోతున్నాం. రానురాను తెలుగు సినిమాల్లో కామెడీ అంటే అసహ్యం వేస్తోంది. దర్శకులు కూడా కామెడీ ట్రాక్ ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారు.
ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం కామెడీ చూస్తే చిరాకు అనిపిస్తుంది. వృద్ధాప్యపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా, చిన్న కాలేజీ కుర్రాడి మాదిరిగా ప్రవర్తిస్తూ నటనలో సహజత్వం లేకుండా చేసే వెకిలివేషాలు చిరాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన మహేష్‌బాబు 'పోకిరి' సినిమాలో ఇలియానాతో బ్రహ్మానందం చేసే కామెడీ ఉదాహరణగా తీసుకోవచ్చు. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పలరాజు'లో కూడా అంతే! మొదట్లో బ్రహ్మానందం కామెడీ బాగుండేది. తర్వాత తర్వాత దిగజారుతోంది. ఇకనైనా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బెటర్. కృష్ణ్భగవాన్, వేణుమాధవ్‌లు ద్వంద్వార్ధాల బూతు డైలాగులకి పెట్టింది పేరు. కేవలం ఇలాంటి నటనకే వీళ్లు ఫిక్స్ అయ్యారు. ఆరోగ్యకరంగా, విభిన్నమైన కోణంలో హాస్యాన్ని అందించే యత్నం మన తెలుగు సినిమాల్లో జరగడంలేదు. ఆరోగ్యకరమైన కామెడీని అందించడానికి జంధ్యాల చాలా శ్రమించారు. అందుకే ఆయన చిత్రాలు ఈరోజుకీ ఆహ్లాదకరంగా ఉంటాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ని తెలుగు ప్రజలు ఎంతో అభిమానంగా చూసుకునేవారు. జంధ్యాలకి రాజేంద్రప్రసాద్ అంటే ఎంతో అభిమానం. రాజేంద్రుని ద్వారా చక్కటి కామెడీ సినిమాలని జంధ్యాల అందించారు. అసలు రాజేంద్రుని కామెడీస్టార్‌గా చేసింది జంధ్యాలే. ఈ స్టార్‌డమ్‌ని మరింత నిలబెట్టింది డైరక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డియే.
ఇప్పుడు మాత్రం తెలుగులో కామెడీ కాలుష్యం రాజ్యమేలుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రముఖంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లలో కూడా నిర్మాతలు 'ఈ చిత్రంలోని కామెడీని మీరు, మీ కుటుంబం ఎంతో ఎంజాయ్ చేస్తారు' అని చెబుతారు. పాపం ఇది నమ్మేసి ఎవరైనా సకుటుంబంగా హాలుకి వెళితే అవుట్. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని అసభ్యకరమైన సన్నివేశాలు. అనేక సినిమాల్లో కమెడియన్ అనుకునే వేణుమాధవ్‌తో పచ్చి బూతు కామెడీ చేయించారు. ఇలాంటి డైలాగ్స్ వేణు బాగా చేయగలడని దర్శకుల నమ్మకం కావచ్చు.
ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కమల్‌హాసన్‌చేత కూడా మంచి కామెడీ చేయించారు. మాటలు లేని సినిమాలో సైతం సింగీతం శ్రీనివాసరావు కడుపుబ్బ నవ్వించారు. అదే పుష్పక విమానం. మనకు హాస్యనటుల కొరత ఏమాత్రం లేదు. అయితే వీరిని చక్కగా ఉపయోగించుకునే డైరక్టర్లు లేరు. ఇక్కడ చాలా వరకు కామెడీసీన్లు కాపీ అవుతున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమ ప్రత్యేకత ఏమిటంటే రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లురామలింగయ్య లాంటి కమెడియన్లు పుట్టారు. వీరందరూ జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పట్లో సన్నివేశానికి ఉండే ప్రాధాన్యతనిబట్టి హాస్యనటులని ఎంపిక చేసేవారు. ఇప్పుడు అలాక్కాదు అంతా లాబీయింగ్. నిరంతరం హీరోల సేవలో మునిగి తేలేవారికి, నిర్మాతలకి, డైరక్టర్లకి కవ్వంకొట్టేవారికి అవకాశాలు అవసరం లేకపోయినా వస్తుంటాయి. అందుకు ఉదాహరణ బ్రహ్మానందం. చిరంజీవి ప్రతీ సినిమాలో బ్రహ్మానందం పిచ్చి కామెడీ లాంటి కామెడీ చేస్తూ కనిపిస్తాడు. 'రిక్షావోడు' సినిమా చెప్పుకోవచ్చు. ఇతన్ని ప్రసన్నం చేసుకుంటేనే పాపం...చిన్నా చితకా కమెడియన్లకి అవకాశాలు వస్తాయి ఆఖరికి వర్మలాంటి డైరక్టర్ కూడా 'అప్పలరాజు' సినిమాలో తప్పనిసరిగా బ్రహ్మానందానికి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చాడు. ఇదే ఈ సినిమాకి మైనస్ అయింది కూడా. ఈ లాబీయింగ్ కారణంగా అపారమైన ప్రతిభ ఉండే ఔత్సాహిక హాస్యనటులు తెరమీదకి రాలేకపోతున్నారు. నిర్మాతకి, హీరోకి నడుమ మీడియేటింగ్ చేసి వేషాలు సంపాదించుకునే వారున్నారు. హీరోకి, హీరోయిన్‌కి వారధిగా ఉండి స్టార్ కమెడియన్‌గా ఎదిగిన వారూ ఉన్నారు. మాటల రచయితగా రాణించిన ఎల్.బి శ్రీరాంకు అంటే ద్వంద్వార్ధాల మాటలను చక్కగా పలికే హాస్యనటునిగా పేరుంది. అందరూ...ఏమిటది అంటే చెప్పే మాట ఒక్కటే డైరక్టర్ ఎలా చెబితే అలా చేస్తాం అని. కొత్తవాళ్లుపాపం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఏదో నానా గడ్డీ కరుస్తున్నారు అనుకోవచ్చు..సీనియర్ కమెడియన్లు కూడా అంతే!! ఈ వయసులో ఎల్‌బి శ్రీరాం, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ అశ్లీల ద్వంద్వార్ధాల మాటల కామెడీ చేయడం అవసరమా?
'వళ్లంతా వంకర్లు తిరిగిపోవడం...పైట లాగడం..తండ్రి కూతురు గదిలోకి డబ్బులు తీసుకుని లోపలికి పంపించడం మన తెలుగు కామెడీకి ఎంతో గొప్ప. ఇలాంటివే తెలుగు హాస్య ఆణిముత్యాలు. కేవలం మనవాళ్లు మాత్రమే చిత్రీకరించే దృశ్యాలు. భారతీయ సినిమా ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? మన స్థాయి ఇంతేనా? ఇంకా చౌకబారు కామెడీయేనా? మారాలి...మరో జంధ్యాల పుట్టాలి. ఆరోగ్యకరంగా నవ్వించే సినిమాలు రావాలి. తెలుగు హాస్యం వర్ధిల్లాలి.

* 180 (బాగోలేదు)

* 180 (బాగోలేదు)
తారాగణం:
సిద్ధార్థ్, ప్రియాఆనంద్,
నిత్యామీనన్, వళి
తనికెళ్లభరణి, గీత, శ్రీచరణ్
తదితరులు.
నిర్మాణం: సత్యం సినిమాస్
అండ్ అగల్ ఫిల్మ్స్
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం
సంగీతం: శరత్
దర్శకత్వం: జయేంద్ర

దక్షిణాది సినిమా రంగం కొత్తతరం దర్శకులతో, సరికొత్త సాంకేతిక సృజనతో కళకళలాడుతోంది. కథలు కొత్తవి కాకపోయినా, కథనంలో నవ్యపోకడలు, వ్యక్తీకరణలో విభిన్న ధోరణులు తెరపై కనిపించి కనువిందు చేస్తున్నాయి. అయితే ఎన్ని వైవిధ్యభరితమైన ఆలోచనలు చేసినా, సామాన్య సినీ ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం అన్న థ్రెడ్ మాత్రం అలాగే వుండాల్సిన పరిస్థితి ఇంకా మారలేదు. ఇటు నవ్యతను, అటు వినోదాన్ని బ్యాలెన్స్ చేసే ఫీట్ వచ్చిన దర్శకులు ఈ విషయంలో విజయం సాధిస్తున్నారు. అలాంటి సర్కస్ చేయలేని వారు, మంచి పేరు తెచ్చుకున్నా, మంచి విజయం మాత్రం సాధించలేకపోతున్నారు. ఇలాంటి జాబితాలో చేరిన మరో దర్శకుడి పేరు జయేంద్ర.
జీవితం హాయిగా సాగిపోతున్న వేళ ఉరుములేని పిడుగులా వచ్చి పడ్డ ఆపద ఒక యువకుడి జీవితాన్ని, అతనితో పెనవేసుకున్న వారి బతుకుల్ని ఎలా చిన్నాభిన్నం చేసిందన్నది కథ. అమెరికాలో డాక్టర్‌గా పనిచేసే (అజయ్) కాశీలో మనోగా మారడంతో కథ ప్రారంభమవుతుంది. మనో ఆర్నెల్ల కోసం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, వీధి అనాధలు, పేపర్‌బాయ్‌లు, ఇలా ప్రతి ఒక్కరితో జాలీగా కలిసిపోయి బతికేస్తుంటాడు. అతడిని ప్రేమిస్తుంది ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేసే నిత్య (నిత్యామీనన్). అయితే కథ అనుకోని మలుపు తిరిగి ఆమె ప్రమాదానికి గురవుతుంది. ఆమెను తీసుకుని అమెరికా వెళ్తాడు మనో. అక్కడ అతగాడి అసలు నేపథ్యం అప్పుడు తెరపైకి వస్తుంది. ఏమిటా నేపథ్యం..అజయ్ అనే మనో కథ ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన సినిమా. కథ తెలుసుకోకుండా సినిమాకు వెళ్తేనే మంచిది.
వాస్తవానికి 180 చిత్రకథ కొత్తదేమీ కాదు. గతంలో మణిరత్నం, కృష్ణవంశీ డీల్ చేసినదే. అయితే మణిరత్నం కవితాత్మకంగా, కృష్ణవంశీ సరదాగా తెరకెక్కించి, కమర్షియల్‌గా ఫెయిల్ కాకుండా జాగ్రత్తపడే ప్రయత్నాలు చేసారు. ప్రకటనల సినిమాల రంగంలో అపార అనుభవం గడించిన జయేంద్ర, వారిద్దరిలా కాకుండా, వెండితెరపై దృశ్య నవలా రచన సాగించినట్లు తీసేందుకు ప్రయత్నించారు. రెడ్‌కెమేరా వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో, చిత్రీకరణలో వైవిధ్యాన్ని ప్రతి రీలులో ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా కథ తక్కువగా వున్న ప్రధమార్థంలో ఇటువంటి పోకడలు ఎక్కువగా వున్నాయి. నెరేషన్ స్లోగా వున్నా, ప్రధమార్థం ఆకట్టుకునేలాగే నడిచింది. కానీ కథలో మలుపులు, సినిమాకు కీలకమైన కథానాయకుడి నేపధ్యం, అందులోని ఎమోషనల్ సన్నివేశాలు, క్లయిమాక్స్ ఇలా, అన్నీ సెకండాఫ్‌లోనే వుండడంతో, ప్రేక్షకుడికి ఒక్కసగంలోనే రెండింతల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కావాలంటే ఇక్కడ కథలో జంప్‌చేసేందుకు కొంత అవకాశం వున్నా, దర్శకుడు నిజాయతీతో వ్యవహరించి, వాస్తవిక దృక్పధంవైపే మొగ్గుచూపాడు. అయితే సినిమా ప్రారంభం నుంచీ ఒక కానె్సప్ట్‌గా పెట్టుకున్న స్లో నెరేషన్ నియమాన్ని సెకండాఫ్‌లో కాస్త సడలించి వుండాల్సింది. ఇలా మొత్తం మీద, సినిమా బీసీ సెంటర్లకు దూరమైంది. మల్టీఫెక్స్‌ల్లో కూడా ఏమేరకు ఆదరణ వుంటుందన్నది సందేహాస్పదమే. కానీ ప్రధమార్ధ చిత్రీకరణలో, స్క్రిప్ట్‌లో దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్లను మరింత బలంగా, క్లుప్తంగా చిత్రీకరించి వుంటే బాగుండేది. పైగా వాటి నడుమ ఇరుక్కోవడంతో రొమాంటిక్ సన్నివేశాలు కూడా పెద్దగా క్లిక్ కాలేదు. దర్శకుడి అన్నిటా తానై కనిపించిన చిత్రంలో ఫొటోగ్రఫీ (బాలసుబ్రమణియం) ఓ విజువల్‌ట్రీట్. (కొన్ని సన్నివేశాలు కావాలని ఏడ్ ఫిల్మ్‌ల్లా తీసినా). 'ఈ వయసిక రాదు' పాట కచ్చితంగా చూసి తీరాలి. మాటలు (ఉమర్జీ అనూరాధ) బహుశా తమిళ వెర్షన్‌కు అనువాదం కావచ్చు, బానే వున్నాయి. దర్శకుడు, ఛాయాగ్రాహకుడి తరువాత చెప్పుకోవాల్సింది సంగీతదర్శకుడు శరత్ వాసుదేవన్ చేసిన కృషి. పాటలు ఎంతమాత్రం క్యాచీగా లేకపోయినా, వాటిల్లో వాడిన ఇనుస్ట్రుమెంటేషన్, నేపథ్యసంగీతం ప్రశంసనీయంగా వున్నాయి. విదేశాల్లో క్రీడాసంస్కృతిలో ఇటీవల భాగమవుతున్న వూవుజెలా(ఒకలాంటి బూరా) ధ్వనిని తొలిసారి వాడింది ఈ సినిమాలోనే కావచ్చు. ఎడిటింగ్ విషయంలో, స్లోనెరేషన్ అన్న కానె్సప్ట్ చెడకుండానే, మరికాస్త జాగ్రత్త పడివుంటే, బాగుండేది. నటీనటుల్లో ప్రియాఆనంద్, ఆ తరువాత సిద్దార్ధ చక్కటి నటన కనబర్చారు. సిద్దార్ధ కొన్ని సన్నివేశాల్లో బాగా చేస్తే, ప్రియాఆనంద్ అన్ని రకాలా మంచి నటన ప్రదర్శించింది. నిత్య ఓకె. చాన్నాళ్లకు గీత తెరపై కనిపించింది.
మొత్తం మీద వైవిధ్యం కోసం ప్రయత్నించి, అంతగా ఫలితం రాబట్టక మిగిలిన చిత్రం 180.