Saturday 2 July 2011

* 180 (బాగోలేదు)

* 180 (బాగోలేదు)
తారాగణం:
సిద్ధార్థ్, ప్రియాఆనంద్,
నిత్యామీనన్, వళి
తనికెళ్లభరణి, గీత, శ్రీచరణ్
తదితరులు.
నిర్మాణం: సత్యం సినిమాస్
అండ్ అగల్ ఫిల్మ్స్
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం
సంగీతం: శరత్
దర్శకత్వం: జయేంద్ర

దక్షిణాది సినిమా రంగం కొత్తతరం దర్శకులతో, సరికొత్త సాంకేతిక సృజనతో కళకళలాడుతోంది. కథలు కొత్తవి కాకపోయినా, కథనంలో నవ్యపోకడలు, వ్యక్తీకరణలో విభిన్న ధోరణులు తెరపై కనిపించి కనువిందు చేస్తున్నాయి. అయితే ఎన్ని వైవిధ్యభరితమైన ఆలోచనలు చేసినా, సామాన్య సినీ ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం అన్న థ్రెడ్ మాత్రం అలాగే వుండాల్సిన పరిస్థితి ఇంకా మారలేదు. ఇటు నవ్యతను, అటు వినోదాన్ని బ్యాలెన్స్ చేసే ఫీట్ వచ్చిన దర్శకులు ఈ విషయంలో విజయం సాధిస్తున్నారు. అలాంటి సర్కస్ చేయలేని వారు, మంచి పేరు తెచ్చుకున్నా, మంచి విజయం మాత్రం సాధించలేకపోతున్నారు. ఇలాంటి జాబితాలో చేరిన మరో దర్శకుడి పేరు జయేంద్ర.
జీవితం హాయిగా సాగిపోతున్న వేళ ఉరుములేని పిడుగులా వచ్చి పడ్డ ఆపద ఒక యువకుడి జీవితాన్ని, అతనితో పెనవేసుకున్న వారి బతుకుల్ని ఎలా చిన్నాభిన్నం చేసిందన్నది కథ. అమెరికాలో డాక్టర్‌గా పనిచేసే (అజయ్) కాశీలో మనోగా మారడంతో కథ ప్రారంభమవుతుంది. మనో ఆర్నెల్ల కోసం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, వీధి అనాధలు, పేపర్‌బాయ్‌లు, ఇలా ప్రతి ఒక్కరితో జాలీగా కలిసిపోయి బతికేస్తుంటాడు. అతడిని ప్రేమిస్తుంది ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేసే నిత్య (నిత్యామీనన్). అయితే కథ అనుకోని మలుపు తిరిగి ఆమె ప్రమాదానికి గురవుతుంది. ఆమెను తీసుకుని అమెరికా వెళ్తాడు మనో. అక్కడ అతగాడి అసలు నేపథ్యం అప్పుడు తెరపైకి వస్తుంది. ఏమిటా నేపథ్యం..అజయ్ అనే మనో కథ ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన సినిమా. కథ తెలుసుకోకుండా సినిమాకు వెళ్తేనే మంచిది.
వాస్తవానికి 180 చిత్రకథ కొత్తదేమీ కాదు. గతంలో మణిరత్నం, కృష్ణవంశీ డీల్ చేసినదే. అయితే మణిరత్నం కవితాత్మకంగా, కృష్ణవంశీ సరదాగా తెరకెక్కించి, కమర్షియల్‌గా ఫెయిల్ కాకుండా జాగ్రత్తపడే ప్రయత్నాలు చేసారు. ప్రకటనల సినిమాల రంగంలో అపార అనుభవం గడించిన జయేంద్ర, వారిద్దరిలా కాకుండా, వెండితెరపై దృశ్య నవలా రచన సాగించినట్లు తీసేందుకు ప్రయత్నించారు. రెడ్‌కెమేరా వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో, చిత్రీకరణలో వైవిధ్యాన్ని ప్రతి రీలులో ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా కథ తక్కువగా వున్న ప్రధమార్థంలో ఇటువంటి పోకడలు ఎక్కువగా వున్నాయి. నెరేషన్ స్లోగా వున్నా, ప్రధమార్థం ఆకట్టుకునేలాగే నడిచింది. కానీ కథలో మలుపులు, సినిమాకు కీలకమైన కథానాయకుడి నేపధ్యం, అందులోని ఎమోషనల్ సన్నివేశాలు, క్లయిమాక్స్ ఇలా, అన్నీ సెకండాఫ్‌లోనే వుండడంతో, ప్రేక్షకుడికి ఒక్కసగంలోనే రెండింతల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కావాలంటే ఇక్కడ కథలో జంప్‌చేసేందుకు కొంత అవకాశం వున్నా, దర్శకుడు నిజాయతీతో వ్యవహరించి, వాస్తవిక దృక్పధంవైపే మొగ్గుచూపాడు. అయితే సినిమా ప్రారంభం నుంచీ ఒక కానె్సప్ట్‌గా పెట్టుకున్న స్లో నెరేషన్ నియమాన్ని సెకండాఫ్‌లో కాస్త సడలించి వుండాల్సింది. ఇలా మొత్తం మీద, సినిమా బీసీ సెంటర్లకు దూరమైంది. మల్టీఫెక్స్‌ల్లో కూడా ఏమేరకు ఆదరణ వుంటుందన్నది సందేహాస్పదమే. కానీ ప్రధమార్ధ చిత్రీకరణలో, స్క్రిప్ట్‌లో దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. ద్వితీయార్ధంలో ఎమోషనల్ సీన్లను మరింత బలంగా, క్లుప్తంగా చిత్రీకరించి వుంటే బాగుండేది. పైగా వాటి నడుమ ఇరుక్కోవడంతో రొమాంటిక్ సన్నివేశాలు కూడా పెద్దగా క్లిక్ కాలేదు. దర్శకుడి అన్నిటా తానై కనిపించిన చిత్రంలో ఫొటోగ్రఫీ (బాలసుబ్రమణియం) ఓ విజువల్‌ట్రీట్. (కొన్ని సన్నివేశాలు కావాలని ఏడ్ ఫిల్మ్‌ల్లా తీసినా). 'ఈ వయసిక రాదు' పాట కచ్చితంగా చూసి తీరాలి. మాటలు (ఉమర్జీ అనూరాధ) బహుశా తమిళ వెర్షన్‌కు అనువాదం కావచ్చు, బానే వున్నాయి. దర్శకుడు, ఛాయాగ్రాహకుడి తరువాత చెప్పుకోవాల్సింది సంగీతదర్శకుడు శరత్ వాసుదేవన్ చేసిన కృషి. పాటలు ఎంతమాత్రం క్యాచీగా లేకపోయినా, వాటిల్లో వాడిన ఇనుస్ట్రుమెంటేషన్, నేపథ్యసంగీతం ప్రశంసనీయంగా వున్నాయి. విదేశాల్లో క్రీడాసంస్కృతిలో ఇటీవల భాగమవుతున్న వూవుజెలా(ఒకలాంటి బూరా) ధ్వనిని తొలిసారి వాడింది ఈ సినిమాలోనే కావచ్చు. ఎడిటింగ్ విషయంలో, స్లోనెరేషన్ అన్న కానె్సప్ట్ చెడకుండానే, మరికాస్త జాగ్రత్త పడివుంటే, బాగుండేది. నటీనటుల్లో ప్రియాఆనంద్, ఆ తరువాత సిద్దార్ధ చక్కటి నటన కనబర్చారు. సిద్దార్ధ కొన్ని సన్నివేశాల్లో బాగా చేస్తే, ప్రియాఆనంద్ అన్ని రకాలా మంచి నటన ప్రదర్శించింది. నిత్య ఓకె. చాన్నాళ్లకు గీత తెరపై కనిపించింది.
మొత్తం మీద వైవిధ్యం కోసం ప్రయత్నించి, అంతగా ఫలితం రాబట్టక మిగిలిన చిత్రం 180.

No comments:

Post a Comment