Saturday 2 July 2011

కామెడీ కాలుష్యం

అశ్లీల దృశ్యాలకీ, పచ్చి బూతు మాటలకీ హాస్యం అని పేరు పెట్టడం కేవలం తెలుగుసినిమాకే చెల్లింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలు ఆరోగ్యవంతమైన కామెడీ అందిస్తుంటే మనం మాత్రం దిగజారిపోతున్నాం. రానురాను తెలుగు సినిమాల్లో కామెడీ అంటే అసహ్యం వేస్తోంది. దర్శకులు కూడా కామెడీ ట్రాక్ ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారు.
ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం కామెడీ చూస్తే చిరాకు అనిపిస్తుంది. వృద్ధాప్యపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నా, చిన్న కాలేజీ కుర్రాడి మాదిరిగా ప్రవర్తిస్తూ నటనలో సహజత్వం లేకుండా చేసే వెకిలివేషాలు చిరాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన మహేష్‌బాబు 'పోకిరి' సినిమాలో ఇలియానాతో బ్రహ్మానందం చేసే కామెడీ ఉదాహరణగా తీసుకోవచ్చు. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పలరాజు'లో కూడా అంతే! మొదట్లో బ్రహ్మానందం కామెడీ బాగుండేది. తర్వాత తర్వాత దిగజారుతోంది. ఇకనైనా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటే బెటర్. కృష్ణ్భగవాన్, వేణుమాధవ్‌లు ద్వంద్వార్ధాల బూతు డైలాగులకి పెట్టింది పేరు. కేవలం ఇలాంటి నటనకే వీళ్లు ఫిక్స్ అయ్యారు. ఆరోగ్యకరంగా, విభిన్నమైన కోణంలో హాస్యాన్ని అందించే యత్నం మన తెలుగు సినిమాల్లో జరగడంలేదు. ఆరోగ్యకరమైన కామెడీని అందించడానికి జంధ్యాల చాలా శ్రమించారు. అందుకే ఆయన చిత్రాలు ఈరోజుకీ ఆహ్లాదకరంగా ఉంటాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ని తెలుగు ప్రజలు ఎంతో అభిమానంగా చూసుకునేవారు. జంధ్యాలకి రాజేంద్రప్రసాద్ అంటే ఎంతో అభిమానం. రాజేంద్రుని ద్వారా చక్కటి కామెడీ సినిమాలని జంధ్యాల అందించారు. అసలు రాజేంద్రుని కామెడీస్టార్‌గా చేసింది జంధ్యాలే. ఈ స్టార్‌డమ్‌ని మరింత నిలబెట్టింది డైరక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డియే.
ఇప్పుడు మాత్రం తెలుగులో కామెడీ కాలుష్యం రాజ్యమేలుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రముఖంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లలో కూడా నిర్మాతలు 'ఈ చిత్రంలోని కామెడీని మీరు, మీ కుటుంబం ఎంతో ఎంజాయ్ చేస్తారు' అని చెబుతారు. పాపం ఇది నమ్మేసి ఎవరైనా సకుటుంబంగా హాలుకి వెళితే అవుట్. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని అసభ్యకరమైన సన్నివేశాలు. అనేక సినిమాల్లో కమెడియన్ అనుకునే వేణుమాధవ్‌తో పచ్చి బూతు కామెడీ చేయించారు. ఇలాంటి డైలాగ్స్ వేణు బాగా చేయగలడని దర్శకుల నమ్మకం కావచ్చు.
ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కమల్‌హాసన్‌చేత కూడా మంచి కామెడీ చేయించారు. మాటలు లేని సినిమాలో సైతం సింగీతం శ్రీనివాసరావు కడుపుబ్బ నవ్వించారు. అదే పుష్పక విమానం. మనకు హాస్యనటుల కొరత ఏమాత్రం లేదు. అయితే వీరిని చక్కగా ఉపయోగించుకునే డైరక్టర్లు లేరు. ఇక్కడ చాలా వరకు కామెడీసీన్లు కాపీ అవుతున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమ ప్రత్యేకత ఏమిటంటే రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లురామలింగయ్య లాంటి కమెడియన్లు పుట్టారు. వీరందరూ జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పట్లో సన్నివేశానికి ఉండే ప్రాధాన్యతనిబట్టి హాస్యనటులని ఎంపిక చేసేవారు. ఇప్పుడు అలాక్కాదు అంతా లాబీయింగ్. నిరంతరం హీరోల సేవలో మునిగి తేలేవారికి, నిర్మాతలకి, డైరక్టర్లకి కవ్వంకొట్టేవారికి అవకాశాలు అవసరం లేకపోయినా వస్తుంటాయి. అందుకు ఉదాహరణ బ్రహ్మానందం. చిరంజీవి ప్రతీ సినిమాలో బ్రహ్మానందం పిచ్చి కామెడీ లాంటి కామెడీ చేస్తూ కనిపిస్తాడు. 'రిక్షావోడు' సినిమా చెప్పుకోవచ్చు. ఇతన్ని ప్రసన్నం చేసుకుంటేనే పాపం...చిన్నా చితకా కమెడియన్లకి అవకాశాలు వస్తాయి ఆఖరికి వర్మలాంటి డైరక్టర్ కూడా 'అప్పలరాజు' సినిమాలో తప్పనిసరిగా బ్రహ్మానందానికి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇచ్చాడు. ఇదే ఈ సినిమాకి మైనస్ అయింది కూడా. ఈ లాబీయింగ్ కారణంగా అపారమైన ప్రతిభ ఉండే ఔత్సాహిక హాస్యనటులు తెరమీదకి రాలేకపోతున్నారు. నిర్మాతకి, హీరోకి నడుమ మీడియేటింగ్ చేసి వేషాలు సంపాదించుకునే వారున్నారు. హీరోకి, హీరోయిన్‌కి వారధిగా ఉండి స్టార్ కమెడియన్‌గా ఎదిగిన వారూ ఉన్నారు. మాటల రచయితగా రాణించిన ఎల్.బి శ్రీరాంకు అంటే ద్వంద్వార్ధాల మాటలను చక్కగా పలికే హాస్యనటునిగా పేరుంది. అందరూ...ఏమిటది అంటే చెప్పే మాట ఒక్కటే డైరక్టర్ ఎలా చెబితే అలా చేస్తాం అని. కొత్తవాళ్లుపాపం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఏదో నానా గడ్డీ కరుస్తున్నారు అనుకోవచ్చు..సీనియర్ కమెడియన్లు కూడా అంతే!! ఈ వయసులో ఎల్‌బి శ్రీరాం, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ అశ్లీల ద్వంద్వార్ధాల మాటల కామెడీ చేయడం అవసరమా?
'వళ్లంతా వంకర్లు తిరిగిపోవడం...పైట లాగడం..తండ్రి కూతురు గదిలోకి డబ్బులు తీసుకుని లోపలికి పంపించడం మన తెలుగు కామెడీకి ఎంతో గొప్ప. ఇలాంటివే తెలుగు హాస్య ఆణిముత్యాలు. కేవలం మనవాళ్లు మాత్రమే చిత్రీకరించే దృశ్యాలు. భారతీయ సినిమా ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? మన స్థాయి ఇంతేనా? ఇంకా చౌకబారు కామెడీయేనా? మారాలి...మరో జంధ్యాల పుట్టాలి. ఆరోగ్యకరంగా నవ్వించే సినిమాలు రావాలి. తెలుగు హాస్యం వర్ధిల్లాలి.

No comments:

Post a Comment