Thursday 21 July 2011

* ‘కీ’ (బాగోలేదు)


తారాగణం:
జగపతిబాబు, స్వప్న, సుకుమార్
దీప్తీబాజ్‌పేయ్, సంపత్, సోనియా
ఛాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: విజయ్ కురాకుల
నిర్మాత: సుకుమార్‌రెడ్డి
నిర్మాణం: డ్రీమ్స్ థియేటర్స్
దర్శకత్వం: నాగేంద్ర ప్రసాద్

బిసి సెంటర్ల ప్రేక్షకులు మహారాజ పోషకులు. ఓ సినిమా బాక్సాఫీసు రికార్డు బద్దలుకొట్టాలంటే అక్కడ జనానికి నచ్చాల్సిందే. మాస్ మసాలా అంశాలు జోడించడానికి కారణం ఇదే. ఆ సినిమాలకు క్లాస్ ప్రేక్షకులూ వచ్చారు. అయితే మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన నేపథ్యంలో ఏక్లాస్ వర్గం కోసం ప్రత్యేక సినిమాల్ని రూపొందిస్తున్నారు. ఈ విధానం బాలీవుడ్‌లో బాగా పాపులర్. కథను కాకుండా కానె్సప్టుని నమ్ముకుని వచ్చిన కొన్ని సినిమాలు కాసులు కురిపించాయి. అదే ప్రయోగం తెలుగు సినిమాలకూ పాకింది అనుకుంటే...ఆ కోవలో వచ్చిన మొదటి సినిమా 'కీ'. ఈ కానె్సప్ట్ ఓరియెంటెడ్ ప్రయోగం మన వాళ్లకి ఎంత వరకూ నచ్చుతుంది? దాని ఫలితం ఏమిటి? అనే విషయాల్లోకి వెళ్లే ముందు కథేంటో తెలుసుకుందాం.
బాగా పేరుపొందిన ఓ కంపెనీలో కీలక స్థానం కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివిధ రంగాలలో పేరు తెచ్చుకున్న తొమ్మిదిమంది చివరి పరీక్షకు హాజరవుతారు అయితే.. ఉద్యోగం మాత్రం ఒక్కరికే. ఎంపిక విధానం మాత్రం వినూత్నంగా ఉంటుంది. ఇన్విజిలేటర్ (జగపతిబాబు) ప్రతి ఒక్కరికీ ఓ పేపర్ ఇస్తాడు. అది చూడ్డానికి తెల్లకాగితం మాత్రమే. కానీ రహస్యం అంతా అందులోనే ఉంది ముందు ప్రశ్న ఏమిటో ఛేదించాలి. ఆ తర్వాత సమాధానం చెప్పాలి. జవాబు పత్రాల్ని చింపడం కానీ, పాడు చేయడం కానీ చేయకూడదు. అక్కడో సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉంటాడు. అతనితో మాట్లాడినా, ఒక్కసారి పరీక్ష హాలునుంచి బయటకు వెళ్లినా వాళ్లు ఉద్యోగానికి అనర్హులే. సమాధానం కోసం వాళ్లకు ఇచ్చిన సమయం తొంభై నిముషాలు. ఇలాంటి కొన్ని నిబంధనలతో ఆట మొదలవుతుంది. ఇంతకీ ఆ పేపర్‌లో ఏముంది? సమాధానం ఎవరు రాబట్టారు? ఈ ఆట వెనక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అనే విషయాలు తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా ఏవర్గానికి నచ్చుతుంది? ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా రాబోయే ఫలితాల్ని అంచనా వేయకుండా ఫార్ములా సూత్రాలకు విరుద్ధంగా వెళ్లి కథను ఎంచుకోవడమనే ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. తెలుగు దర్శకులు కొత్తగా ఆలోచించగలుగుతున్నారు....అనే విషయం ధైర్యంగా చెప్పుకోవడానికి ఇలాం టి సినిమాలు ఉపయోగపడతాయి. ఈ సినిమాలో ఓ ఇంగ్లీష్ డైలాగ్ ఉంది. దాన్ని తెలుగులో మార్చుకుంటే- 'కార్య సాధకులకే తప్ప...ఎప్పుడూ ఆలోచనలతో గడిపేవారికి ఈ ప్రపంచంలో విలువ లేదు' అని అర్ధం వస్తుంది. అందుకే కార్యరంగంలోకి దిగిన దర్శక నిర్మాతలు ఇద్దరికీ వీరతాళ్లు వేయాల్సిందే. అయితే ఆ ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి? అని అడిగితే కథ మళ్లీ మొదటికి వస్తుంది.
ముందే చెప్పినట్టు ఇందులో కథ కన్నా, కానె్సప్టుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి అంశాన్ని ఎంచుకుంటున్నప్పుడు కథనం తప్పకుండా బలంగా ఉండాల్సిందే. తరువాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ కలగాలి. అయితే 'కీ'దాన్ని సగం మాత్రమే నెరవేర్చింది. నటీనటులు అంతా కొత్తవారే కాబట్టి త్వరగా రిజిస్టర్ అవ్వరు. జగపతిబాబు ఉన్నా ఆయన అచ్చం ఈ సినిమాలోని ఇన్విజిలేటర్‌లానే ఇలా వచ్చి అలా వెళతాడు. తెలుగు చానల్ రంగంలో బాగాపాపులర్ అయిన న్యూస్‌యాంకర్లు ఈ 'కీ'లోకనిపిస్తారు. వాళ్ల డైలాగులు చెబుతున్న విధానం చూస్తే అచ్చం టీవీ-9లో న్యూస్ చూస్తున్నట్టే ఉంటుంది రియాల్టీ షోల పేరుతో టీవీ చానళ్లవాళ్లు చేసే హంగామా మనకు తెలుసు. ఈ సినిమా చూస్తుంటే పెద్ద తెరమీద ఓ రియాల్టీ షోచూస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప మనం ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. ఉద్యోగం కోసం..ఒకరిని ఒకరు చంపుకుంటుంటే వినోదం చూపిన ఆ కంపెనీ సిఇఓ చివర్లో వచ్చి సందేశం వల్లించడం వింతగా విడ్డూరంగా ఉంటుంది. సినిమా రూపకర్తలు చెప్పినట్టు అంతా ఫజిల్‌లా ఉన్నా బాగుండేది. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడు కథలో తానూ ఓ పాత్రలా మారిపోయే వీలు చిక్కేది. కానీ అలా జరగలేదు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికొస్తే ఆర్ట్, కెమెరా, సంగీతం వీరందరికన్నా కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరక్టర్లే తక్కువ కష్టపడ్డాడు. కథంతా ఒకే రూమ్‌లోజరుగుతుది కాబట్టి వాళ్లకు అసలు పనిచేసే అవకాశమే దక్కలేదు. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. ఒకే గదిలో విభిన్న కోణాల్లోంచి కెమెరాను నడిపించి పీజీవిందా ఆకట్టుకుంటాడు. ఈ గంటన్నర సినిమాలు మాస్ వర్గానికి చేరువ అవుతుందా? అని అడిగితే కష్టమే అని చెప్పాల్సి వస్తుంది. వాళ్లకోసం కథలో ఐటమ్ సాంగ్ అతికించలేని దర్శకుడిని మెచ్చుకోవాలి. అయితే ఈ కథతో క్లాస్‌నైనా మెప్పించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దానికి తోడు సైన్స్ ఫార్ములా పదాలు...ఎవరికోగాని ఎక్కవు. సినిమా మూడు గంటలైనా, గంటలోపే ముగిసినా అంతిమంగా ప్రేక్షకుడికి వినోదం ముఖ్యం. దానికి లోటు జరగకపోతే క్లాసూ, మాసూ అందరూ చూస్తారు. మొత్తంమీద చెప్పొచ్చేదేమిటంటే కానె్సప్టు కథతో అల్లుకున్న ఈ సినిమాలో తొమ్మిది పాత్రలతో పాటు థియేటర్లో ప్రేక్షకుడూ బందీగా మిగులుతాడు.

No comments:

Post a Comment