Friday 24 June 2011

Feed Back

'రంగం' నిజంగా ఓ కొత్త తరంగం ప్రస్తుతం సినీ పరిశ్రమకు. కె.వి ఆనంద్ నిస్సందేహంగా అభినందనీయుడే. పెద్ద కథనం నడిపించాడు చిన్న కథతో. జీవాకు గుర్తుంచుకోదగ్గ పాత్ర లభించింది. వసంత్ పాత్రధారి కిక్ శ్యామ్ లాగున్నాడు. పాటలు రెండు తప్ప మిగిలినవి వినడానికి, చూడ్డానికి చాలా బాగున్నాయి. చెలి, ఆరెంజ్‌లను గుర్తు తెస్తాయి. టెక్నాలజీని చక్కగా వాడుకున్నాడు. సినిమాలోను, సినిమా బయటా మీడియా వాళ్లు తప్పనిసరిగా చూడాల్సిందే. కార్తీక బాగుంది. కోట, ప్రకాష్‌రాజ్‌లవి చిన్న పాత్రలే. కథే హీరో ఇక్కడ.
-సింగరాజు సైదయ్య, నడిమూరు
కొన్ని లక్షలు
ఆదా అయ్యేవి కదా!
వంద శాతం లవ్ చిత్రం నుంచి ఎడిటింగ్‌లో తొలగించిన సన్నివేశాలను మా ఛానల్‌లో చూపిస్తూ వాటిని తొలగించడానికి కారణాలుగా బోర్ కొడుతుందని, రూడ్‌గా ఉందని, రిపీట్ అయిందని చెప్పుకొచ్చారు దర్శకులు సుకుమార్. కొనే్నళ్ల క్రితం జెమినిలో ఇలాటి కార్యక్రమమే వచ్చేది. వీక్షకులకు ఒక సందేహం. బోలెడు డబ్బు పోసి చిత్రీకరించిన తర్వాత తొలగించే కన్నా స్క్రిప్ట్ దశలోనే బాగా ఆలోచించి తొలగిస్తే కొన్ని లక్షలు ఆదా అయ్యేవి కదా!
-శుభ, కాకినాడ
కుంటుసాకు మాత్రమే!
ఈసారి కూడా తెలుగు సినిమాలకు ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదు. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలదే హవా. వాళ్లు లాబీయింగ్ చేసుకున్నారన్నది కుంటుసాకు మాత్రమే. మన చిత్రాల్లో తెలుగు వాతావరణం ఉందా? తెలుగు వేషభాషలు సంస్కృతీ సంప్రదాయాలున్నాయా? అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరిశీలనకు ఎంపికైన ఐదు చిత్రాల్లో రెండు (వేదం, బ్రోకర్) చూశాను. ఆ రెండు కొన్ని సంఘటనల గుది కూర్పు తప్ప కథ అంటూ లేదు. రెండింటిలోను క్లైమాక్స్ కృతకంగా, అసహజంగా ఉన్నాయి. ఒక చిత్రంలో దర్శకుడు తులనాత్మకత కోల్పోయి కొన్ని సామాజిక వర్గాలపట్ల పక్షపాతం చూపాడు. రొడ్డకొట్టుడు చిత్రాలకు ఇవి భిన్నంగా ఉండి ఆకర్షించినా అవార్డు సాధించే సత్తాలేదు.
-శాండిల్య, కాకినాడ

No comments:

Post a Comment