Friday 24 June 2011

వాడు-వీడు Film Review

*వాడు-వీడు

తారాగణం:
విశాల్, ఆర్య, ప్రభ
మధుశాలిని, జనని అయ్యర్
జి.ఎం.కుమార్, ఆర్‌కె
అంబిక తదితరులు.
కెమెరా: ఆర్డర్ విల్సన్
మాటలు: శశాంక్ వెనె్నలకంటి
సంగీతం: యువన్‌శంకర్ రాజా
దర్శకత్వం: బాలా

సినిమా అంటే మెరుగులు దిద్ది, పూతపూసిన ఓ నిజం. కొన్నిసార్లు ఆ నిజం వాస్తవానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే పూత మరీ ఎక్కువైందన్న మాట. ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ ఈ కోవకు చెందినవే. కొంతమంది దర్శకులు పూతకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవన్నీ వాస్తవానికి చాలా సమీపంగా వెళ్లి అల్లిన కధలన్న మాట. అందులో ఫాంటసీ ఉండదు. ఊహలుండవు. అబద్ధాలుండవు..కేవలం జీవితాలుంటాయి. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేస్తారన్నమాట. ఇక మూడోవర్గం దర్శకులున్నారు. వాళ్లు వాస్తవం అనే గీతను దాటేసి మరీ సినిమాలు తీస్తుంటారు. అందులో సన్నివేశాలు చెంప చెళ్లుమనిపిస్తాయి. ఇంకొన్ని కన్నీరు పెట్టిస్తాయి. కొన్నిసార్లు ఆలోచింపచేస్తాయి. మరికొన్ని ఏవగింపు కలిగిస్తాయి. ఇవన్నీ ఇప్పుడు బాలా తెరకెక్కించిన 'వాడు-వీడు' సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూద్దామని థియేటర్‌లో అడుగుపెట్టే ముందు ఓ మాట..
బాలా సినిమాల్లో కథ కంటే పాత్రల్లోని సంఘర్షణలే కీలకం. శివపుత్రుడు, నేను దేవుడ్ని...ఈ సినిమాలు చూసినవాళ్లకి ఈ విషయం అర్ధమయ్యే ఉంటుంది. అందుకే బాలా సినిమాలో కథగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. సంఘర్షణో, ఘర్షణో...తప్ప.వీటిని తెరమీద చూపించాలన్నా ఓ కథ కావాలి...అనే విషయం దర్శకుడు బాలా ఈ సినిమాలో మరిచిపోయాడు. అందుకే మనం కూడా కథ జోలికి వెళ్లకుండా నేరుగా సినిమాలోని 'విషయం'లోకి అడుగుపెట్టేద్దాం.
సినిమా అంటే కేవలం గ్లామర్ కోసమే అనుకునేవాళ్లు చచ్చినా ఈ థియేటర్ (కనీసం వాల్‌పోస్టర్) వైపు కూడా చూడొద్దు. మసాలా కోసం ఆశ పడేవాళ్లు, ఐటమ్ సాంగ్ కోసం కలలు కనేవాళ్లు ఈ సినిమా చూడకపోవడమే ఉత్తమం. ఓ హీరో ఉండాలి...అతను నిమిషానికో డ్రస్సు మార్చాలి, హీరో ఒంటిచేత్తో రౌడీలను కొడుతుంటే వాళ్లు కిలోమీటరు దూరంగా ఎగిరెగిరి పడాలి...ఇలాంటి ఆలోచనలన్నీ చెత్తబుట్టలో పారేసి, ఫ్రెష్‌గా థియేటర్‌లోకి అడుగుపెట్టే దమ్ముంటే తప్ప ఈ సినిమా చూడొద్దు. మరి ఈ సినిమాలో ఏముంది? అని ఆలోచిస్తే మనం ఇంతవరకు చూడని మనుషులున్నారు. మనం ఇప్పటివరకు ఊహించని సమాజం ఉంది. మన ఆలోచనలకు, ఊహలకు అందని కొన్ని జీవితాలున్నాయి. కానీ అవెలా ఉన్నాయి? వాటిని బాలా ఎలా చూపించాడు? అదే విషయం దగ్గరే చిక్కొచ్చిపడింది.
'అమ్మాయిల ప్యాంట్‌లకు జిప్పు ఉంటుందా? ఉంటే వాటివల్ల ఉపయోగం ఏమిటి?' అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి నేరుగా అడిగితే..? అప్పుడా అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పాలి? ఈ డైలాగు వినగానే దర్శకుడికి ఇలాంటి చెత్త ఆలోచన ఎందుకొచ్చిందని బాధపడాలా? 'అవును కరక్టే..' కదా అని అభినందించాలా?
'కంట్లోంచి నీరు కారకపోతే ఉచ్చ (క్షమించాలి) కారుతుందా?- అనే మాట విని '్భలేపాయింటు' అని మురిసిపోవాలా?
ఓ సన్నివేశంలో విశాల్ బహిర్భూమికి వెళ్లొస్తూ- 'నువ్ పిలవగానే కడుక్కోకుండా వచ్చేయడానికి నేనేమైనా నీ మొగుడ్నా?' అంటాడు. 'అమ్మా...మరీ పిండి పిండిలా వస్తుందమ్మా...' అనే విశాల్ ప్రశ్నకే కడుపులో కెలికేసినట్టుంటే- 'వాటితో వచ్చినోళ్లకు దోసెలుగానీ వేసివ్వాలేంటి?' అనే అమ్మ సమాధానం లోపల ఉన్నదంతా బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ సన్నివేశాలన్నీ సహజత్వం కోసమే అనుకుంటే మీరెళ్లి నిరభ్యరంతరంగా సినిమా చూడండి.
'ఒరేయ్..మొత్తమంతా నువ్వే తాగేయకుండా నాకూ ఓ నైన్టీ ఉంచు. తాగకపోతే నిద్రేరావడంలేదు..'- ఓ తల్లి ఓ కొడుకుని అడగవలసిన మాట ఇదేనా? - ఇలాంటి సన్నివేశాలు, సంభాషణలు ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తాయి. దర్శకుడిగా బాలా తీరే అంత అని సర్దుకుపోయేవాళ్లు సినిమాలోని సహజత్వాన్ని అర్ధం చేసుకోగలిగినా, ఓ మోస్తరు అంచనాలతో థియేటర్‌కు వెళ్లినా వాళ్లు ఏ మాత్రం జీర్ణం చేసుకోలేని విషయాలివి. ఈ సినిమాలో ఏపాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఊహించడం కష్టం. కానీ తెరమీద కనిపించే నటీనటులంతా బాలా స్కూలుకి తగినట్టు నటించారు. కొన్నిసార్లు స్కేలు దాటేస్తున్నారేమో..అనిపించినా అది బాలా శిక్షణలో లోపమే తప్ప మరోటి కాదు.
మట్టిముద్దకూ ఓ రూపం ఇవ్వగల దర్శకుడు బాలా. విక్రమ్, సూర్యల్ని నటులుగా మలిచిన ఘనత ఆయనదే. ఈ సినిమాలో ఆయన ఎంచుకున్న మట్టిముద్ద...విశాల్. తన 'నవరస' నటనా విన్యాసంతో విశాల్ ప్రేక్షకుల్ని కట్టేపడేసాడు. సినిమా అంతా మెల్ల కన్నుతో కనిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కొన్ని సందర్భాల్లో విశాల్ హావ భావాలు చూస్తే...అప్పటికప్పుడు ఏదో ఓ అవార్డు ఇచ్చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఒకేసారి నవరసాలు పండించిన సన్నివేశం అద్భుతం కాకపోవచ్చు కానీ..విశాల్‌లోని నటుడిని ఆవిష్కరించాయి అనడంలో సందేహం లేదు. ఆ సన్నివేశంలో సూర్య (అతిథి పాత్ర)తోపాటు ప్రతి ఒక్కరి హావ భావాలు భేషుగ్గా అనిపించాయి. ఆర్య నటనను ఒక్క శాతం కూడా తప్పు పట్టలేం. బాలా దర్శకత్వంలో ఇదివరకే నటించిన అనుభవం ఉంది కనుక...ఈసారి మరింత సులువుగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు విశాల్. ఆర్య, విశాల్‌ల పరిపక్వమైన నటన చూడాలనుకుంటే-'వాడు-వీడు'కి మించిన సినిమా మరోటి ఉండదు కాక ఉండదు. అయితే ఇలాంటి నటన ప్రదర్శించే వేదిక (కథ) సరైనది మాత్రం సరైనది కాదు. సినిమాలో ఏ సన్నివేశానికీ కంటిన్యుటీ ఉండదు. కొన్ని విషయాలను మధ్యలో వదిలేసి చేతులు దులుపుకున్నాడు. విశాల్ కొట్టేసిన కోటి రూపాయల సరుకు ఏమైంది? అనే ప్రశ్నకు సినిమా చివరి వరకు సమాధానం దొరకదు. ఈసినిమాతో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? అనే విషయం కూడా అంతుపట్టదు. కేవలం విశాల్ నటనా విన్యాసాన్ని ఆవిష్కరించేందుకు ఏదో ఓ సినిమా తీస్తే చాలు..అనుకున్నాడేమో! ఆత్మీయుడి చావునుంచి...విషాదంతో పాటు తన సినిమాకి ముగింపు కూడా తెచ్చుకోవడం బాలాకు తెలిసిన విద్య. 'శివపుత్రుడు'లో పాటించిన ఆ పద్ధతినే...ఈ సినిమాలోనూ కొనసాగించాడు. అయితే ఆ సన్నివేశం కూడా క్రూరంగా తెరకెక్కించి కన్నీళ్లు పెట్టించాడు. మట్టిమనుషులు, అందులోని జీవితాలు చూపించడం బాలాకి సరదా. గత సినిమాల మాదిరిగా ఈ సినిమాలోనూ మట్టి ఉంది. అయి తే...అందులో కమ్మటి వాసనే లేదు

No comments:

Post a Comment