Friday 24 June 2011

Good Feed Back

అదరగొట్టారు!
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ చిత్రం ప్రేమికులకు బాగా నచ్చుతుంది. ప్రేమలో ఇగోలు ఉండవద్దు అని చెప్పిందీ చిత్రం. బాలు-మహాలక్ష్మి పాత్రల్లో బావ మరదళ్లుగా నాగ్-తమన్నా అదరగొట్టారు. పాటలన్నీ సందర్భోచితంగా హత్తుకున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకుల గుండె తలుపుల్ని తడుతుంది. తమన్నా మహాలక్ష్మిగా అదరకొట్టింది.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి
బాగా పేలింది..!
'సీమ టపాకాయ్' చాలా బాగుంది. బాగా పేలింది. షడ్రసోపేతమైన భోజనం చేసినట్టు అన్నీ ఉన్నాయి. హాస్యం, శృంగారం, కరుణ నవరసాలూ మేళవించాడు దర్శకుడు. హీరోయిన్ ఉత్సాహవంతమైన నృత్యం, నటనతో ప్లస్ మార్కులు వేయించుకుంది. నరేష్ కూడా అతిగా కాకుండా బాగా చేశాడు. షాయాజీషిండే, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడులాంటి విలన్‌లు కన్నీళ్లు పెట్టించడమే గొప్ప. షిండేకి మంచి పాత్ర లభించింది. సినిమాలోని బిట్లన్నీ కాపీ అన్న ఫీలింగ్‌ను కలిగిస్తున్నా, చివరకు పాత్రల్లోని వ్యక్తులతో సహా హాస్యం అన్న చక్కెర పూత పూసి, మనచేత హిట్ మాత్ర మింగించేశాడు.
-కాళిదాసు విజయచారి, కావలి
సినిమాకే హైలెట్..!
దేశంలో ప్రబలుతున్న కుళ్లు రాజకీయాలను ఎండగడుతూ పోసాని కృష్ణమురళి తీసిన దుశ్శాసన చిత్రం ఫరవాలేదనిదపించింది. సమకాలీన రాజకీయ సమస్యలను తెరపై చూపించిన విధానం బాగుంది. అయితే సమస్యలను సృజించి మాత్రమే వదిలేయకుండా, వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేయడం హర్షణీయం. శ్రీకాంత్ నటన సినిమాకే హైలెట్. కామన్‌మాన్ పాత్ర చాలాకాలం వరకూ గుర్తుండిపోవడం ఖాయం. రోజుకో పార్టీ మార్చే పాత్రలో బ్రహ్మానందం సెటైర్లు బాగున్నాయి. అయితే సినిమా అంతా సీరియస్‌గా సాగడంవలన కామెడీ అసలు లేకపోవడంలన మధ్యలో ప్రేక్షకుడికి బోర్ కలగడం ఖాయం. సినిమాలో అన్నిరకాల హంగులను చేర్చివుంటే ఇంకా మంచి చిత్రం అయ్యేది.
-బి.ప్రతాప్, సూర్యాపేట, నల్లగొండ
స్పష్టత లోపించింది!
సమాజంలోని ప్రజలు, రాజకీయ నాయకుల ప్రవర్తనకి విసిగిన దర్శకుడు చేసిన నిరసనే ఈ చిత్రం. ఆలోచనలు మంచివే కాని తీసే విధానంలోనే స్పష్టత లోపించింది. చెప్పాలనుకోవడం సులభమే చేయాలనుకోడమే కష్టం. అదీ ఈ సినిమా ద్వారా తెలిసింది. కొన్ని సన్నివేశాలు కృతకంగా ఉన్నా డిఫరెంట్ మూవీ చూసామన్న తృప్తి కలిగింది. మధ్యలో హాస్యం ఉంటే రిలీఫ్‌గా ఉండేది. మంచి నటులను సెలక్టు చేసుకున్నారు కానీ వారికి సరైన అవకాశం లేదు. అంతా శ్రీకాంతే కర్త కర్మ క్రియ అయి చిత్రాన్ని నడిపించారు.
-డా.పి.రాఘవేంద్రరావు, విశాఖపట్నం

No comments:

Post a Comment