Saturday 2 July 2011

* భేజా ఫ్రై-2

* భేజా ఫ్రై-2

తారాగణం:
వినయ్ పాఠక్ , మినీషాలాంబా
కె.కె.మీనన్, సురేషమీనన్ తదితరులు
సంగీతం: సాగర్ దేశాయ్
రచన, దర్శకత్వం: సాగర్ బళ్ళారి

భేజాఫ్రై వెర్రిబాగులవాడు మళ్లీ వచ్చాడు! గాయకుడు కావాలన్న పట్టుదలతో పల్లెటూరునుంచి నగరానికొచ్చి మ్యూజిక్ కంపెనీ యజమాని బుర్ర తీనేసిన ది గ్రేట్ అమాయక చక్రవర్తి భరత్ భూషణ్ (వినయ్‌పాఠక్) భేజాఫ్రై-2 అంటూ మరోసారి గందరగోళం సృష్టించడానికి ప్రత్యక్షమయ్యాడు. నాలుగేళ్ల విరామం తరువాత వచ్చినవాడు మరింత ఆధునికంగా, స్టయిలిష్‌గా, ఇన్‌కంటాక్స్ సూపర్‌వైజర్ రూపంలో దిగబడి, బోగస్ కంనీల కార్పొరేట్ బాస్ వెంటపడ్డాడు. మెదడు ఫ్రై చేసి వదిలాడు.
'లే డిన్నర్ డీ కాన్స్' అనే ఫ్రెంచి కామెడీకి అనుసరణ అయిన భేజాఫ్రై (2007) విజయం చిన్న సినిమాల ట్రెండ్‌కి ఊపునిచ్చింది. అదొక ఆధునిక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రత్యర్థుల పాత్రలు ధరించిన వినయ్‌పాఠక్, రజత్ కపూర్‌ల మధ్య కెమిస్ట్రీ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనేట్టుగా కుదిరింది. గాయకుడిగా ఆడియో కంపెనీ యజమాని రజత్‌కపూర్ ఇంట్లో చేరి బుర్ర తినేస్తూ భోళాతనంతో రజత్‌కపూర్ సాంసారిక జీవితాన్ని పాడుచేసేస్తాడు. ఈ కామెడీ బాగా పేలింది!
ఈసారి ఈ భరత్ భూషణ్ 'ఆవో గెస్ కరే' అనే రియాల్టీ షోలో జాక్‌పాట్ కొట్టేస్తాడు. పాతిక లక్షల క్యాషు, రెండు రాత్రులు ఓడ ప్రయాణం గిఫ్టు పుచ్చుకుని ఓడెక్కుతాడు. ఆ ఓడలో ఇన్‌కంటాక్స్ శాఖ కన్నుగప్పి పారిపోతున్న కార్పొరేట్ బాస్ అజిత్ తల్వార్ (కెకె మీనన్) ఉంటాడు. ఇతను రకరకాల బోగస్ కంపెనీలు స్థాపించి పెద్ద స్కాం చేశాడు. భరత్ భూషణ్ ఇతడ్ని తగులుకుంటాడు. ఇతను భరత్‌భూషణ్ ఇన్‌కంటాక్స్ సూపర్‌వైజర్ అని తెలుసుకుని, తనని పట్టుకునేందుకే వచ్చాడనుకుని సముద్రంలోకి తోసేయబోతాడు. ఆ ప్రయత్నం ఫెయిలై తనే వెళ్లి సముద్రంలో పడతాడు. ఇతడి సెక్రటరీ వచ్చి భరత్‌భూషణ్‌ని తోసేస్తాడు. సముద్రంలో పడ్డ అజత్ తల్వార్-్భరత్ భూషణ్‌లిద్దరూ బతుకు జీవుడా అని ఒడ్డుకు చేరుకుని ఆ నిర్జన ప్రాంతంలో పడరాని పాట్లు పడతారు. ఇంటర్వెల్ వరకూ ఈ సినిమా మంచి హాస్యాన్ని పండిస్తుంది. బ్లడీఫూల్ భరత్ భూషణ్ పాత్రలో వినయ్ పాఠక్ బాగా రాణిస్తాడు. అతడికి కె.కె మీనన్‌తో కెమిస్ట్రీ కుదరకపోయినా, ఇంకాఓడలో రకరకాల వీఐపీలతో హీరోయిన్ మినీషాలాంబాతో చేసే వెర్రి చేష్టలు క్లాస్ హ్యూమర్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇతనూ, కె.కె.మీనన్ సముద్రంలో వెళ్లి పడే ఇంటర్వెల్ మలుపుతో మాంచి కిక్‌నిస్తుందీ సినిమా. అంతవరకే. ఆ తర్వాత సెకండాఫ్ అంతా రుచీ పచీ లేని మాడిన ఫ్రైగా విసుగుపుట్టిస్తుంది. దారీ తెన్నూ తెలీని నిర్జన ప్రాంతంలో చిక్కుకున్న ఇద్దరి మధ్యా తగాదాలకి ఏమాత్రం బేస్ ఉండదు. ఇందుకు కారణం వినయ్ పాఠక్ పాత్రకి ఏ లక్ష్యమూ లేకపోవడమే. ఇతనే తనని పట్టుకునేందుకు వచ్చిన ఐటి అధికారి అని భ్రమించి తప్పించుకునే లక్ష్యం కె.కె.మీనన్ ఒక్కడికే ఉంది. ఇతను స్కాం వీరుడని కూడా వినయ్ పాఠక్‌కి తెలీనే తెలీదు.
పాయింటులేని కథనం, పాత్రలు స్క్రీన్‌ప్లేని కుప్పకూల్చాయి. ఫస్ట్ఫాలో క్లాస్ హ్యూమర్ కాస్తా సెకండాఫ్‌లో చీప్ కామెడీగా మారిపోయింది. రచయిత, దర్శకుడు సాగర్ బళ్లారి ఈ రెండో ప్రయత్నంలో మసాలాలు మిస్ చేసి ఫ్రైని పూర్తిగా మాడ్చాడు.

No comments:

Post a Comment